రష్యాలోని కురిల్ దీవులలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత నమోదయింది. జపాన్ వాతావరణ శాఖ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ ఈ విషయాన్ని వెల్లడించాయి. రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియలేదు. భూకంపం దాటికి పలు నగరాల్లోని భవనాలు ఊడిపోయాయని రష్యా మీడియా తెలిపింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు పేర్కొంది.
ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రత నమోదయింది. ఈ భారీ భూప్రకంపనల దాటికి రష్యా, జపాన్ తో పాటు ఉత్తర పసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. దాని ప్రభావంతోనే తాజాగా భూకంపం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.