సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తయారు చేసే ఐఫోన్లు ప్రైవసీకి, సెక్యూరిటీకి పేరుగాంచాయి. వాటిల్లో యూజర్ల డేటాకు అత్యుత్తమ భద్రత, ప్రైవసీ లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకనే చాలా మంది ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇష్ట పడుతారు. అయితే కాలిఫోర్నియాలో జరిగిన ఆ సంఘటన మాత్రం ఐఫోన్లపై యూజర్లకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేలా ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
అమెరికాలోని ఓరెగాన్ అనే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని 2016లో తన యాపిల్ ఐఫోన్ ను రిపేర్ చేయించాలని చెప్పి కాలిఫోర్నియాలోని యాపిల్ రిపేర్ ఫెసిలిటీలో అందజేసింది. అయితే ఆమె ఫోన్‌ను రిపేర్ చేసిన సిబ్బంది ఇద్దరు అందులోని డేటాను చోరీ చేశారు. ఆమె నగ్న ఫోటోలను వారు సేకరించి ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో అందరూ ఆమె తన ఫొటోలను తానే ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిందేమోనని అనుకున్నారు. కానీ జరిగిన విషయం తెలిసి షాకయ్యారు.
ఈ క్రమంలో తాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాలంటూ ఆ విద్యార్థిని అక్కడి కోర్టులో కేసు వేయగా.. దాన్ని విచారించిన న్యాయమూర్తి చివరకు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆమెకు 5 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని చెల్లించాలని చెప్పారు. అయితే ఈ కేసు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. కానీ ఆ సంఘటన జరిగిన అనంతరం తక్షణమే యాపిల్ ఆ ఇద్దరు టెక్నిషియన్లను ఉద్యోగం నుంచి తొలగించింది. ఏది ఏమైనా.. యాపిల్ ఐఫోన్లలో డేటా ప్రైవసీ, సెక్యూరిటీపై మరోమారు నీలి నీడలు కమ్ముకున్నాయి.