సాధారణంగా మనం ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నా సరే.. అది బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది.. అనే విషయాన్ని ముందుగానే ఎంక్వయరీ చేస్తాం. ఆ తరువాతే మనకు నచ్చిన ఫోన్‌ను కొంటాం. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లు ఇచ్చినంత బ్యాటరీ బ్యాకప్‌ని ఐఫోన్లు ఇవ్వవు. అవి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి, కానీ ఆండ్రాయిడ్ ఫోన్లంత ఇవ్వవు. అయితే కింద తెలిపిన పలు టిప్స్ పాటిస్తే.. ఐఫోన్లలో బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటంటే…
* ఐఫోన్‌లో ఉండే ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్‌ను ఆన్ చేయడం వల్ల బ్యాటరీ గణనీయంగా సేవ్ అవుతుంది. ఫోన్ ఉన్న వాతావరణంలో అందుబాటులో ఉన్న వెలుతురును బట్టి బ్రైట్‌నెస్ దానంతట అదే సెట్ అవుతుంది. దీంతో బ్యాటరీ బ్యాకప్ పెంచుకోవచ్చు. ఇందుకు గాను ఫోన్‌లోని సెట్టింగ్స్ – జనరల్ – యాక్సస్సబిలిటీ – డిస్‌ప్లే అండ్ టెక్ట్స్ సైజ్ అనే విభాగంలోకి వెళ్లి అక్కడ ఉండే ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్‌ను ఆన్ చేయాలి.
* ఐఫోన్‌లో వీలైనంత వరకు వైఫైను వాడాలి. మొబైల్ డేటా వాడితే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కనుక వైఫై అందుబాటులతో ఉంటే వీలైనంత వరకు దాన్ని వాడడమే ఉత్తమం.
* ఐఫోన్‌లోని సెట్టింగ్స్ – బ్యాటరీ అనే విభాగంలో ఉండే లో పవర్ మోడ్‌ను ఎనేబుల్ చేయాలి. దీంతో ఫోన్ బ్యాటరీ 20 శాతానికి చేరుకోగానే ఫోన్ ఆటోమేటిగ్గా బ్యాటరీని ఆదా చేసే పనిలో పడుతుంది. ఈ క్రమంలో కాల్స్, ఎస్ఎంఎస్‌లు తదితర బేసిక్ ఫంక్షన్లు మాత్రమే ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి. దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది.
* ఐఫోన్‌లోని సెట్టింగ్స్ – జనరల్ విభాగంలో ఉండే బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనే ఫీచర్‌ను ఆఫ్ చేయడం వల్ల కూడా ఐఫోన్ బ్యాటరీ సేవ్ అవుతుంది.
* ఐఫోన్‌లో లొకేషన్ సర్వీస్‌ను ఆఫ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకోవాలి.