అమెరికాలో క్యాపిటల్‌ భవనాలకు బాంబు బెదిరింపులు

-

అమెరికాలో పలు రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వాటిని ఖాళీ చేయించారు. ఇరాన్‌లో భీకర పేలుళ్ల వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో అధికారులు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. అగ్రరాజ్యంలోని జార్జియా, కనెక్టికట్‌, కెంటుకీ, మిషిగాన్‌, మిన్నెసోటా, మిసిసిపీ, మోంటానా, మైన్‌, హవాయి రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాలకు ఈరోజు ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి.

గుర్తు తెలియని ఈ-మెయిల్‌ ఐడీ నుంచి ఒకేసారి అన్ని ఆఫీసులకు ఈ సందేశాలు చేరినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. తక్షణమే ఆ భవనాలను ఖాళీ చేయించి డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టామని.. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. అవి నకిలీ బెదిరింపులని ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) ధ్రువీకరించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు ఇరాన్‌లో బుధవారం జంట పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల కిందట అమెరికా దాడిలో మరణించిన ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్‌, అమెరికా హస్తం ఉందంటూ ఇరాన్ ఆరోపిస్తున్న తరుణంలో అమెరికాకు బాంబు బెదిరింపులు రావడం మరింత కలవరానికి గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news