భారత్‌లో 2019 సంవత్సరంలో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, ఆ వ్యాధి వల్ల 9.3 లక్షల మరణాలు సంభవించాయి. ఈ విషయంలో చైనా తరవాతి స్థానం భారతదేశం ఉంది. ఆసియాలో చైనా, భారత్, జపాన్ దేశాల్లో అత్యధిక క్యాన్సర్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. 2019లో ఆసియా దేశాలలో మొత్తం 94 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 56 లక్షల మరణాలు సంభవించాయని తెలిపింది.
వీటిలో ఒక్క చైనాలోనే 48 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 27 లక్షల మరణాలు నమోదయ్యాయని ఈ అధ్యయనంలో తేలింది. జపాన్‌లో 9 లక్షల కొత్త కేసులు, 4.4 లక్షల మరణాలు సంభవించాయని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. భారతీయ శాస్త్రజ్ఞులతో సహా కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 1990 నుంచి 2019 వరకు 49 ఆసియా దేశాల్లో 29 రకాల క్యాన్సర్లను పరిశీలించారు. ఆసియాలో అత్యధిక క్యాన్సర్లు శ్వాసకోశం, ఊపిరితిత్తుల్లో సంభవిస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అధ్యయన కాలంలో ఈ వ్యాధి 13 లక్షల మందికి సోకగా, 12 లక్షల మంది మరణించినట్లు వెల్లడించారు.