బ్రిటన్ హోంమంత్రి జేమ్స్ క్లెవర్లీ వివాదంలో చిక్కుకున్నారు. తన భార్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆ దేశంలో మహిళా సంఘాల ఆగ్రహం ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి రిషి సునాక్ నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో డిసెంబర్ 18న జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో మాట్లాడుతూ జేమ్స్ క్లెవర్లీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు సండే మిర్రర్ న్యూస్ పేపర్ తెలిపింది.
తన భార్యకు ప్రతి రాత్రి డేట్ రేప్ డ్రగ్ ఇచ్చేవాడినని ఓ పార్టీలో జేమ్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. భార్య మత్తులో ఉంటే బయట వారు ఎంత బాగా ఉన్నా వారిని పట్టించుకోరని వ్యాఖ్యానించారు. దీర్ఘకాల వైవాహిక బంధానికి అదే రహస్యమంటూ ఆయన చెప్పడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా జేమ్స్ స్పందించారు. అది కేవలం జోక్ అని చెప్పుకొచ్చారు. అలాంటి డ్రగ్‌ను చట్టవిరుద్ధంగా మార్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.