కరోనా సమయం(2022)లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. వైఫల్యాల వల్ల జరిగిన నష్టం.. ఇతర అంశాలపై బహిరంగ విచారణ జరుపుతున్న కమిటీ ముందు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్ వైరస్ తీవ్రతను తమ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని తెలిపారు. చైనాలో వైరస్ ప్రారంభమవుతున్న దశలో తమ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని అంగీకరించిన బోరిస్ జాన్సన్.. దానికి తానొక్కడిని మాత్రమే బాధ్యుడిని కాదని చెప్పుకొచ్చారు. ఇది సమష్టి వైఫల్యమని తనతో పాటు మంత్రులు, అధికారులు, శాస్త్ర సలహాదారుల బాధ్యత కూడా ఉందని కమిటీకి వివరించారు.
అంతే కాకుండా వైరస్ తీవ్రతపై వారు తగిన స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించలేదని ఆరోపించారు. 2020 ఫిబ్రవరిలో వైరస్‌పై ఐదు సమావేశాలు జరిగాయని.. అందులో ఒక్కదానికీ తాను హాజరు కాలేదని.. ఆ సమావేశాల మినిట్స్‌ను మాత్రం ఒకట్రెండు సార్లు చూశానని తెలిపారు. కొవిడ్‌తో బ్రిటన్‌లో సుమారు 2,30,000 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ చేపట్టిన విచారణలో జాన్సన్.. కొవిడ్ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పారు.