కెనడా-భారత్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు రోజురోజుకు ముదురుతున్నాయి. దీనివల్ల ఇరు దేశాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. దీనిప్రభావం ఇరు దేశాల ఆర్థిక పరిస్థితులపై పడుతోంది. తాజాగా ఈ ఉద్రిక్తతల వల్ల కెనడా విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ దేశంలో ఏ నగరానికి వెళ్లాలన్నా విమాన టికెట్ ధరలపై సాధారణ ధర కన్నా వంద శాతానికిపైగా అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
సాధారణంగా సెప్టెంబరు చివరి వారంలో కెనడాలోని విద్యా సంస్థలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ నెల మొదటి వారంలో టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి దుబాయి మీదుగా కెనడాకు వెళ్లేందుకు ఒకవైపు టికెట్ ధర రూ.55 వేల నుంచి 65 వేల మధ్య ఉంటుంది. సెప్టెంబర్‌లో మాత్రం ఆ ధర రూ.లక్ష నుంచి రూ. 1.10 లక్షల వరకు పలుకుతుంది. ప్రస్తుతం ఒకవైపు టికెట్ ధర రూ.1.35 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు పలుకుతోందని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.