త్వరలో బైడెన్, జిన్​పింగ్ భేటీ.. శాన్‌ఫ్రాన్సిస్కో సదస్సులో కలవనున్న అగ్రనేతలు

-

అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ త్వరలో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది. నవంబరు చివర్లో శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో భాగంగా బైడెన్‌, జిన్‌పింగ్‌ భేటీ జరగనున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ వెల్లడించారు. జిన్‌పింగ్‌తో భేటీ కోసం తాను ఎదురు చూస్తున్నట్లు బైడెన్ తెలిపారని పెర్రీ పేర్కొన్నారు. ఇరు నేతల మధ్య ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అంశం చర్చకు వస్తుందా… అన్నదానిపై వైట్‌హౌస్‌ స్పష్టత నివ్వలేదు.

అయితే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్​కు మద్దతు ఇస్తోంది. ఇటీవలే ఆ దేశంలో పర్యటించిన బైడెన్.. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో కూడా సమావేశమయ్యారు. మరోవైపు చైనా పాలస్తీనాకు మద్దతుగా కామెంట్స్ చేస్తోంది. అంతర్జాతీయ మానవతా చట్టాల పరిధికి లోబడి మాత్రమే ఇజ్రాయెల్ యుద్ధం చేయాలని సూచిస్తూనే.. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని పునరుద్ఘాటించింది చైనా. ఈ నేపథ్యంలో చైనా, యూఎస్ అధ్యక్షుల సమావేశం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ భేటీలో ఇజ్రాయెల్- హమాస్ అంశం చర్చకు వస్తే ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version