ఇటీవల కాలంలో చైనాను ప్రకృతి విపత్తలు వణికిస్తున్నాయి. మొన్నటి దాక వర్షాలు.. ఆ తర్వాత మంచు వర్షం.. నిన్న కొండచరియలు విరిగిపడిన ఘటన.. ఇక ఇవాళ ఏకంగా భూకంపం. డ్రాగన్ దేశాన్ని తాజాగా భారీ భూకంపం కుదిపేసింది. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి రిక్టర్‌స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా పలు భవనాలు కంపించాయి. మరికొన్ని చోట్ల భవనాలు పాక్షికంగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం వెలువడలేదు.
మరోవైపు చైనా భూకంపం ధాటికి భారత్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా దిల్లీలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప కేంద్రం వుషీ కౌంటీలోని ఓ టౌన్‌షిప్ పరిధిలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా భూవిజ్ఞాన కేంద్రం వెల్లడించింది. తర్వాత 5.3 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించిందని.. ఈ భూకంప కేంద్రం చైనా, కిర్గిజిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు పేర్కొంది.