ఓవైపు దట్టంగా కురుస్తున్న మంచు.. మరోవైపు మంచుతుపాను.. ఇంకోవైపు కొండచరియలు.. అప్పుడప్పుడు భారీ వర్షాలతో చైనా వణికిపోతోంది. ఓ విపత్తు తర్వాత మరో విపత్తు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. తాజాగా చైనాలోని ఓ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 47 మంది దుర్మరణం చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది మృతి చెందారు. ఈ ఘటన బీజింగ్ కాలమానం ప్రకారం సోమవారం రోజున తెల్లవారుజామున 5:51 గంటలకు ఝాటోంగ్ నగరంలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. విరిగిపడిన కొండచరియల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం కోసం 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మెషీన్లను ఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.