భారత్‌తో ద్వైపాక్షిక వివాదం తర్వాత మాల్దీవులకు అండగా ఉంటానని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్దీవుల్లో తాగునీటి కొరత నెలకొనడంతో చైనా సాయం అందించింది. ఇందులో భాగంగా ఆ దేశానికి 1,500 టన్నుల తాగునీరు అందజేసింది. టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి చైనా ఈ నీటిని సేకరించి మాల్దీవులకు చేరవేసింది.
గతేడాది నవంబరులో టిబెట్ అటానమస్ రీజియన్ ఛైర్మన్ యాన్ జిన్హాయ్ మాల్దీవుల్లో పర్యటించిన సందర్భంగా తాగునీటి కొరతను అధిగమించేందుకు తాము సాయం చేస్తామని హామీ ఇచ్చారు. చైనా పంపిన నీటితో తమ దేశంలో తాగునీటి కొరతను అధిగమించవచ్చని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. త్వరలోనే ఈ నీటిని అన్ని ప్రాంతాల్లో సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.
మాల్దీవులతో ఇప్పటికే చైనా సైనిక ఒప్పందం కుదుర్చుకుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తెలిపారు. ఇందులో భాగంగా తమ దేశానికి చైనా బాష్ప వాయుగోళాలు, పెప్పర్ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను ఉచితంగా అందించడంతోపాటు సైనిక శిక్షణ ఇస్తుందని వెల్లడించారు.