కెన్యాలో ఓ మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ దేశ డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లా(61)తో పాటు తొమ్మిది మంది మిలిటరీ ఉన్నతాధికారులు మృతి చెందారు. రాజధాని నైరోబీ నుంచి 400 కి.మీ దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు.
కెన్యా స్థానిక కాలమానం ప్రకారం గురువారం రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు విలియం వెల్లడించారు. తీవ్ర విచారంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. ప్రమాద వార్త తెలియడంతో జాతీయ భద్రతా కౌన్సిల్‌తో అధ్యక్షుడు రూటో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రమాదానికి కారణాలపై విశ్లేషించారు.
ఈ ఘటనపై ఆరా తీయడానికి దేశ ఎయిర్ ఫోర్స్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. ఈ ప్రమాదంతో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు దేశంలో సంతాప దినాలు పాటించాలని అధ్యక్షుడు ప్రకటించారు. పరాక్రమవంతులైన జనరల్స్, గాలంట్ అధికారులు, సర్వీస్ మెన్, ఒక మహిళా అధికారిని మాతృభూమి కోల్పోయినట్లు రూటో పేర్కొన్నారు.