అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కుస్వపక్షం నుంచి రోజురోజుకు వ్యతిరేకత ఎక్కువవుతోంది. పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం తాజాగా బైడెన్ పోటీపై తీవ్రంగా స్పందించారు . ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని వ్యాఖ్యానించారు. అదే జరిగితే డెమోక్రాటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ కోల్పోతుందని అన్నారు. ఆ పార్టీకి పెద్దఎత్తున విరాళాలు సమకూర్చుతున్న వారిలో క్లూనీ ఒకరు కావడం గమనార్హం.
‘‘ఈ అధ్యక్షుడితో మనం నవంబరు ఎన్నికల్లో గెలవబోం. పైగా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ ఓడిపోబోతున్నాం. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్ ఇదే భావిస్తున్నారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. నేను జూన్‌లో అతిపెద్ద విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాను. దానికి వచ్చిన బైడెన్‌లో తాను చాలా మార్పులు చూశాను. 2010 నాటి.. కనీసం 2020 నాటి ఉత్సాహం కూడా ఆయనలో కనిపించలేదు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో సంవాదంలో అందరూ చూసిన వ్యక్తినే నేను చూశాను.” అని కూన్లీ తెలిపారు.