అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన ఆ దేశంలో కలకలం రేపింది. అయితే ట్రంప్ పై ముందస్తు ప్లానింగ్ ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు సూచిస్తున్నాయి. దుండగుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. ట్రంప్ వచ్చే సమయానికే అతడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రదేశం సభాస్థలి.. గన్‌మెన్ పొజిషన్ తీసుకొన్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ దాడికి పాల్పడిన నిందితుడి వయసు సుమారు 20 ఏళ్లని, స్థానికుడిగానే గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దర్యాప్తు సంస్థలు నిందితుడి పేరును మాత్రం వెల్లడించలేదు. నిందితుడు ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపగా ఆ ఆయుధాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. మరోవైపు ఎత్తైన పొజిషన్‌లో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్నిప్పర్ స్పందించి అతడిపై ఎదురుదాడి చేశాడు. మరోవైపు గాయపడి కిందకు వంగిన ట్రంప్ పైకి లేవగానే.. ‘నేను ఎప్పటికీ లొంగిపోను’ అని పిడికిలి బిగించి నినాదం చేశారు.