రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని పలువురు దేశాధ్యక్షులు ఖండిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిచారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ ఘటనపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు తెలుసుకున్న బైడెన్.. ఇది సరైనది కాదన్నారు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని చెప్పారు. త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానని వెల్లడించారు. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడిందన్నారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ర్యాలీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాని తెలిపారు. ఇలాంటి ఘటనలను ఖండించడంలో యావత్ దేశం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని బైడెన్ పేర్కొన్నారు.
మరోవైపు ట్రంప్‌పై కాల్పులను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖండించారు. ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ జరుగలేదని తెలిసి ఊరట చెందానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని భవంతుణ్ని ప్రార్థిస్తున్నాని చెప్పారు.