అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తారుమారు చేసేందుకు కుట్ర చేశారన్న కేసులో తాను నిర్దోషినే అని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ నేరారోపణలు మోపిన 2 రోజుల తర్వాత.. ట్రంప్ గురువారం మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. మెజిస్ట్రేట్ ప్రశ్నించినప్పుడు ట్రంప్ లేచి నిల్చుని సమాధానం ఇచ్చారు.
‘అమెరికాకు ఇది విచారకరమైన రోజు. దేశంలో ఇలా జరుగుతుందని నేనెప్పుడు అనుకోలేదు. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారు.’ అని విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని ఆయనపై నేరాభియోగం నమోదైంది. ఇందులో ఆయన దోషిగా తేలితే ట్రంప్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.