నాకు శిక్షపడినా అధ్యక్షుడిగా పోటీ చేస్తా : డొనాల్డ్ ట్రంప్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదు చేసిన కేసుల్లో శిక్షపడినా రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం, అర్థరహితమని ట్రంప్‌ తోసిపుచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో తన విజయావకాశాలకు గండికొట్టేందుకే విచారణ చేపట్టారనీ ఆరోపించారు. జార్జియా, ఉత్తర కరోలినాల్లో శనివారం రిపబ్లికన్ల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు.

పదవి నుంచి దిగిపోయినప్పుడు పెద్దఎత్తున అధికారిక పత్రాలను తన ఇంటికి ట్రంప్‌ తీసుకుపోయినట్లు అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం కోర్టుకు హాజరుకాబోతున్న ఆయన ఈ విచారణపై ఆయన మండిపడ్డారు. ‘మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఒకదాని తర్వాత ఒకటిగా విచారణలు చేపడుతున్నారు. అమెరికా ప్రజల అభీష్టాన్ని అణచివేయడం వారి ఉద్దేశం. ఇదంతా నా వెంట కాదు.. మీ (ప్రజల) వెంట పడడమే. నన్ను వేధింపులకు గురిచేసినా ఎప్పటికీ వదిలేది లేదు’ అని చెప్పారు. రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైతే తనను తాను క్షమించుకుంటారా అని ప్రశ్నించినప్పుడు.. అలాంటి అవసరమే రాదన్నారు. తాను ఎన్నడూ ఏ తప్పు చేయలేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version