అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించారు. ట్రంప్ కోసం భారీఎత్తున నిధులు సమకూర్చేందుకు ఆయన ముందుకొచ్చినట్లు సమాచారం. ప్రతినెల దాదాపు 45 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.376 కోట్లు) ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు మస్క్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది.
ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు గానీ, బైడెన్‌కు గానీ తన వైపు నుంచి ఆర్థిక సహకారం ఉండబోదంటూ గతంలో మస్క్ ప్రకటించినా తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీ (PAC)కి పెద్ద మొత్తంలో విరాళం అందించారు. తాజాగా ట్రంప్‌పై కాల్పుల ఘటనతో ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు మరోసారి విరాళాలు అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్‌నకు మద్దతుగా ఏర్పాటైన కొత్త సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి (సూపర్ ప్యాక్) జులై మొదలుకొని ప్రతినెలా 45 మిలియన్ డాలర్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సదరు కథనం పేర్కొంది.