ఓవైపు భారత్‌పై ఆరోపణలు.. మరోవైపు నాజీ వ్యవహారంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చుట్టు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పలువురు ప్రముఖులు విమర్శలు కుప్పిస్తున్నారు. తాజాగా జస్టిన్ ట్రూడోపై స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ట్రూడో.. వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేస్తున్నారని మండిపడ్డారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు కచ్చితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇటీవల ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్‌వాల్డ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేయగా.. దానిపై మస్క్ స్పందించారు.
ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయి. పాడ్‌కాస్ట్‌లను అందించే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాలి. అని సదరు జర్నలిస్టూ ట్వీట్ చేయగా.. ‘‘కెనడాలో వాక్ స్వేచ్ఛను అణిచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు. సిగ్గుచేటు’’ అని ఎలాన్ మస్క్ స్పందించారు.