మస్క్ మరో క్రేజీ ప్లాన్ .. ట్విటర్ యూజర్ల నుంచి రుసుం వసూల్..?

-

ట్విటర్​ను చేజిక్కించుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. అప్పటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విటర్​ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కంపెనీ నుంచి పెద్ద బాస్​లను, ఆ తర్వాత సగానికిపైగా ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. అనంతరం వెరిఫైడ్ యూజర్లకు నెలకు 8 అమెరికన్ డాలర్లు వసూల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడేమో ఏకంగా ట్విటర్ యూజర్లందరి నుంచి రుసుం వసూల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి ట్విటర్​లోని కీలక ఉద్యోగులతో చర్చించారట.

ట్విటర్‌ యూజర్లందరూ ఎంతోకొంత చెల్లించేలా మస్క్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలలో కొన్ని రోజులు ఉచితంగా సర్వీసు అందించి, ఆ తర్వాత వినియోగానికి రుసుము వసూలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏక్షణంలోనైనా మస్క్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఫీచర్ అభివృద్ధి కోసం ఎలాన్‌ మస్క్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది ఓ కొలిక్కి వచ్చేంత వరకు పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అంశంపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version