రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని అన్నారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయణ్ను హతమార్చే అవకాశం ఉందని సంచలన కామెంట్స్ చేశారు. అందుకే ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. అలా జరగాలనే ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందని ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే తన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తనను చాలా మంది విమర్శిస్తున్నారని మస్క్ వాపోయారు. కానీ, తాను చెబుతోంది నిజమని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోయే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇంకా ఉక్రెయిన్ గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం వారికే నష్టమని తెలిపారు. అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.