మలిదశ ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను మాత్రం మరచిపోవడం బాధాకరం: కడియం శ్రీహరి

-

దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని చెప్పారని.. చాలా ఏళ్లు పాలించిన కాంగ్రెస్సే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్‌ కూడా కృతజ్ఞతలు తెలిపారు.. బడ్జెట్‌ ప్రవేశపెడుతూ తెలంగాణ ఇచ్చిన యూపీఏ, సోనియాకు కృతజ్ఞతలు చెప్పారని కడియం అన్నారు.

అయితే బడ్జెట్ డాక్యుమెంట్లో మలిదశ ఉద్యమ నాయకులు, కేసీఆర్‌ను మాత్రం మరచిపోవడం బాధాకరమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం చేశారని.. 2001లో తెలంగాణ మలి దశ ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తొలి దశ, మలి దశ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్సేనని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్‌ న్యాయం చేయట్లేదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయని వ్యాఖ్యానించారు.

“నియంతృత్వ, నిర్బంధ పోకడలు ఉన్నాయంటున్న వారే ఎమర్జెన్సీ విధించిన విషయం మరచిపోయారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎమర్జెన్సీ చీకటిరోజులు మరచిపోయినట్లున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇందిరా గాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 404 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యమని చెప్పినా 40 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చేట్లు లేదు.” అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version