అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు కోసం డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. హోరాహోరీ ర్యాలీలు నిర్వహిస్తూ అగ్రరాజ్యంలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ విషయం తెలిపారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తనని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బుధవారం రోజునే ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. ఈ ఇంటర్వ్యూ ఎక్స్‌లో ప్రసారమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ట్రంప్‌ను ఎక్స్ నిషేధించిన విషయం తెలిసిందే.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సహా కొందరు రాజకీయ నాయకులను హత్య చేసేందుకు ఓ పాకిస్థానీ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్‌వ్రే తెలిపారు. నిందితుడికి ఇరాన్‌తో కూడా బలమైన సంబంధాలున్నాయని పేర్కొన్నారు.