భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రపంచ దేశాల నిర్లక్ష్య ధోరణిపై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు చేసింది. అదే విఫలమైతే ‘భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. ప్రపంచ దేశాలు నిబద్ధతకు అనుగుణంగా వ్యవహరించడం లేదని ఆందోళన చెందుతున్నానని ఆయన వాపోయారు. జెనీవాలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.
భవిష్యత్తులో మహమ్మారులను నిర్మూలించడం, సంసిద్ధంగా ఉండటం, ఒకవేళ సంభవిస్తే త్వరగా ప్రతిస్పందించడంపై అంతర్జాతీయ స్థాయిలో ఓ ఒప్పందాన్ని చేసుకోవాలని డిసెంబర్ 2021న డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలు నిర్ణయించాయి. ఈ ఏడాది మే 27న నిర్వహించనున్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వార్షిక సమావేశంలోగా ఇది పూర్తి చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతుండగా దీనిపై ఎవ్వరూ ముందుకు రాకుంటే, మొత్తం ప్రాజెక్టు మూలనపడే ప్రమాదం ఉందని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందానికి ధైర్యం కావాలని.. రాజీ పడాలని చెప్పారు. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని సభ్యదేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.