ఆఫ్రికా దేశం జాంబియాను కలరా వ్యాధి వణికిస్తోంది. వేలాదిమంది ఈ వ్యాధి బారిన పడగా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కలరా కారణంగా 600 మంది ప్రాణాలు కోల్పోగా.. 15 వేల మంది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆ దేశంలోని మొత్తం పది ప్రావిన్సుల్లో తొమ్మిదింటిలో ఈ వ్యాధి ప్రబలింది. స్టేడియాల వద్ద ప్రభుత్వం తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి మాస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో జాంబియాకు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశానికి క్లోరిన్ ట్యాబ్లెట్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలతో కూడిన 3.5 టన్నుల మానవతా సాయాన్ని పంపించింది.
మరోవైపు పరిస్థితులు దిగజారడంతో అక్కడి ప్రభుత్వం విశ్రాంత వైద్య సిబ్బంది సేవలను తీసుకుంటోంది. ఈ సమయంలో భారీ వర్షాలు వైద్య సేవలు, సురక్షిత నీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నాయి. మామూలుగా కలరాతో మరణాల రేటు ఒకశాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ జాంబియాలో ఆ రేటు నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది.