బంగ్లాదేశ్ లో భారత వీసా సెంటర్లు బంద్

-

బంగ్లాదేశ్ ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. అయితే షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసినా ఆ దేశంలో ఇంకా శాంతి భద్రతలు అదుపులోకి రాలేదని తెలిసింది. దీంతో అనేక మంది పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలనుకుంటున్నారు. ఇప్పటికే వేలాదిమంది భారత సరిహద్దులకు చేరిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులిచ్చేంతవరకు మూసివేస్తున్నామని ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మెసేజ్ పెట్టారు. అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారమిస్తామని వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఇటీవలే.. భారత హైకమిషన్‌, కాన్సులేట్‌లో పనిచేసే అత్యవసర విధుల్లో లేని సిబ్బంది, వారి కుటుంబాలను ఇప్పటికే దిల్లీకి తీసుకొచ్చారు. అయితే, దౌత్యవేత్తలు మాత్రం అక్కడే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news