అభిమానులకు బహుమతులు ఇస్తానని ప్రకటించి చిక్కుల్లో పడ్డాడో ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్. కానుకల కోసం వేలాది మంది ఒక్కసారిగా పోటెత్తడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుని అల్లర్లకు దారి తీసింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
న్యూయార్క్‌కు చెందిన 21ఏళ్ల ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కై సీనట్ మన్‌హటన్ యూనియన్ స్క్వేర్ పార్క్‌లో శుక్రవారం సాయంత్రం లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేయనున్నట్లు తన ఇన్‌స్టా పేజీలో ఓ పోస్ట్ పెట్టాడు. తన ఫ్యాన్స్‌ను నేరుగా కలిసి ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా పలు గిఫ్ట్‌లు ఇస్తానని ప్రకటించాడు.సీనట్ పోస్ట్‌తో మన్‌హటన్ పార్క్‌కు అతడి ఫ్యాన్స్ పోటెత్తారు. 2వేలకు పైగా మంది యువత సీనట్‌ను చూసేందుకు అక్కడకు వచ్చారు. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సీనట్ అభిమానుల్లో కొంతమంది పార్క్ వీధుల్లో వాహనాలను అడ్డగించి అల్లర్లకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో పోలీసు అధికారుల సహా పలువురు గాయపడ్డారు. అల్లర్లను ప్రేరేపించినందుకు సీనట్పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.