ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య పోరు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్ పై హమాస్ భీకర దాడులు చేస్తోంటే.. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతిస్తూనే.. గాజా పౌరులకు మానవతా సాయం చేయాలని ఇజ్రాయెల్ కు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది.
గాజా ప్రాంతంలో ప్రజలపై దాడులకు ఇజ్రాయెల్‌ను అమెరికా ప్రోత్సహిస్తోందని ఆరోపించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ .. గాజాపై బాంబు దాడులను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రైసీ.. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇబ్రహీం రైసీ తీవ్ర విమర్శలు చేశారు.
పాలస్తీనా ప్రజలపై క్రూరమైన దాడులను ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం చేస్తోందని రైసీ ఆరోపించారు.. వీలైనంత త్వరగా గాజాలో బాంబు దాడులు ఆగుతాయని తాము విశ్వసిస్తున్నామని.. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, గాజాలోని ప్రజలకు తక్షణ సాయం అందజేయాలని కోరారు. అమెరికా, యూరోపియన్ దేశాల మద్దతుతో మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ.. ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.