ఇజ్రాయెల్-హమాస్ల మధ్య తాత్కాలిక సయోధ్య కుదిరింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత వాయిదా పడుతున్నట్లు వార్తలు రావడంతో అంతా నిరాశ చెందారు. తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపం దాల్చుతోంది. ఇవాళ ఉదయం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చి.. బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈరోజు ఉదయం 7 గంటల నుంచి నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ అమల్లో ఉండనుంది. ఈ సమయంలో బందీలను ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం విడతల వారీగా విడుదల చేస్తాయి. హమాస్ 50 మందిని విడుదల చేయనుండగా ఇజ్రాయెల్ 150 మందికి విముక్తి కల్పించనుంది. విడుదలకు అర్హులైన 300 మంది జాబితాను ఇప్పటికే ఇజ్రాయెల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా గాజాలోకి భారీ మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించనుంది. ఇవాళ మధ్యాహ్నానికి 13 మంది బందీలు విడుదల కానున్నారు. ఇందులో మహిళలు, పిల్లలున్నారు.
వాస్తవానికి గురువారమే కాల్పుల విరమణ ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం సాయంత్రం వరకూ చర్చలు జరిపిన ఖతార్ చివరకు రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో ఎట్టకేలకు ఒప్పందం అమల్లోకి వచ్చింది.