హమాస్ మిలిటెంట్లను అంతం చేయడమే అంతిమ లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఓవైపు వైమానిక దాడులు మరోవైపు భూతల దాడులతో ఆ ప్రాంతంలో నరమేధం సృష్టిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం రోజున గాజాపై భూతల దాడులు చేస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున ముగ్గురు బందీలను హతమార్చింది.
హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను ముప్పుగా భావించిన తమ దళాలు కాల్పులు జరపడం వల్ల వారు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ సైనిక ప్రధాన అధికార ప్రతినిధి డేనియల్ హగారి వెల్లడించారు. హమాస్ నుంచి బందీలు తప్పించుకున్నారా లేక మిలిటెంట్లే విడిచిపెట్టారా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మరోసారి తప్పు జరగకుండా భూతల దాడుల్లో నిమగ్నమైన దళాలకు సూచనలు చేసింది.
మరోవైపు హమాస్కు జరుగుతున్న యుద్ధంలో తాము ఇజ్రాయెల్ పక్షానే ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని .. అయితే పౌరుల ప్రాణాలకు ఎక్కువ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.