గాజాపై దాడులు ఆపేదే లే.. అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్లే: ఇజ్రాయెల్ ప్రధాని

-

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం రోజురోజుకు భీతావహంగా మారుతోంది. ఓవైపు హమాస్‌ మిలిటెంట్లు ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడుల్ని ముమ్మరం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై హమాస్‌ రాకెట్‌ దాడులకు తెగబడుతోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఈ దేశాల మధ్య యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ప్రపంచాన్ని కలవర పెడుతోంది. ఇరు దేశాలు యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నా.. అవి ఏం పట్టనట్టుగా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హమాస్ సమూలంగా నాశనం అయ్యే వరుక గాజాలో కాల్పులు, దాడులు ఆపేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లు అవుతుందని, అలా ఎప్పటికీ జరగదని తేల్చి చెప్పారు. హమాస్‌ చెరలో ఉన్న బందీలను విడిపించుకోవడంలో తమకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని ఆయన కోరారు. హమాస్‌ వెంటనే, బేషరతుగా బందీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేయాలని నెతన్యాహు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news