జపాన్ దేశంలో నీరు, నిప్పు, భూమి విలయం సృష్టిస్తున్నాయి. ఓవైపు వరుస భూ ప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే మరోవైపు అగ్నిప్రమాదాలు ఇళ్లను ఎక్కడికక్కడ దగ్ధం చేస్తున్నాయి. మరోవైపు భూప్రకంపనల ధాటికి సునామీ హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. ఇలా ప్రకృతి విపత్తులు కొత్త ఏడాదిలో జపాన్ను వణికిస్తున్నాయి. ఒక్క సోమవారమే ఈ దేశంలో తీవ్రమైన 155 ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3-7.6 మధ్యలో నమోదైంది.
ఇవాళ కూడా జపాన్లో ఆరు సార్లు భూమి కంపించగా మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 24కు చేరిందని జపాన్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. అగ్నిప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు టైమ్స్ కథనం పేర్కొంది. ఇక నీగట, టొయామ, ఫుకూయ్, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అటు భూకంపం కారణంగా నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తాజాగా తగ్గించారు.