జీ-20కు ముందు జిల్‌ బైడెన్‌కు కరోనా.. అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన రద్దయినట్లేనా..?

-

అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్‌ కొవిడ్‌ బారినపడ్డారు. ఆమెకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైట్ హౌజ్ వెల్లడించింది. ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ప్రస్తుతం డెలావెర్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్‌ తమ ప్రకటనలో పేర్కొంది.

జిల్ బైడెన్‌కు పాజిటివ్‌ అని తెలియగానే అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయనకు వైరస్‌ నెగెటివ్‌గానే నిర్ధారణ అయినట్లు తెలిపారు.

‘గత శనివారం బైడెన్‌ దంపతులు ఫ్లోరిడాలోని హరికేన్‌ ఐడాలియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత వీరిద్దరూ డెలావెర్‌లోని బీచ్‌ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బైడెన్‌ సోమవారం ఫిలడెల్ఫియాలోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వైట్‌హౌస్‌ చేరుకున్నారు. జిల్ బైడెన్‌ మాత్రం డెలావెర్‌లోనే ఉండిపోయారు. అక్కడే ఆమె స్వల్ప అనారోగ్యానికి గురవడంతో పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.’ అని వైట్ హౌజ్ వెల్లడించింది. జిల్ బైడన్ కరోనా బారినపడటంతో ఈనెల 9వ తేదీన బైడెన్ భారత పర్యటన పై సందిగ్ధత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news