గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య వచ్చే వారంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇప్పటి వరకైతే ఒక నిర్దిష్ట ఒప్పందం కుదరలేదని అన్నారు. ఇరు పక్షాల మధ్య సంధిలో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేయాలి.
దాదాపు ఆరు వారాల పాటు కాల్పుల విరమణ కొనసాగొచ్చని సమాచారం. ఇదే విషయమై హమాస్ మినహా వివిధ పక్షాలకు చెందిన ప్రతినిధులు గతవారం ప్యారిస్‌లో సమావేశమైనట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. సంధి ఖరారుకు అడ్డంకిగా ఉన్న అంశాలు చర్చించినట్లు వెల్లడించారు. అనంతరం ఈజిప్టు, ఖతర్, అమెరికా నిపుణులు ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులతో భేటీ అయినట్లు కైరో అధికారిక మీడియా తెలిపింది. మరోవైపు హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని ఇజ్రాయెల్ అధికారి ఒకరు వైనెట్ మీడియాతో తెలిపారు.