ఇక చాలు నరమేధం ఆపండి.. చిన్నారులు చనిపోతున్నారు: జస్టిన్‌ ట్రూడో

-

హమాస్‌ను సమూలంగా అంతం చేసేందుకు కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ గాజాపై ముప్పేట దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. తాజాగా ఈ యుద్ధంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ యుద్ధం వల్ల గాజాలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్​పై గాజా యుద్ధాన్ని ట్రూడో తప్పుబట్టారు.

గాజాపై ఇజ్రాయెల్ మారణకాండను ప్రపంచమంతా చూస్తోందని ట్రూడో అన్నారు. ఇజ్రాయెల్ కాస్త సంయమనం పాటించి గాజాపై దాడులు ఆపాలని కోరారు. దయచేసి ఈ నరమేధాన్ని ఆపాలని ఇజ్రాయెల్​కు ట్రూడో విజ్ఞప్తి చేశారు. మరోవైపు హమాస్​ను ఉద్దేశించి.. యుద్ధంలో అమాయక పాలస్తీనా ప్రజలను అడ్డు పెట్టుకుని ఉగ్రవాదులు రక్షణ పొందడం సరికాదని హితవు పలికారు. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడిచి పెట్టాలని హమాస్​ను కోరారు. ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. తమ పౌరులపై హమాస్‌ జరిపిన మారణహోమాన్ని ఎక్స్ వేదికగా ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version