టీడీపీ కార్యకర్తలకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. కార్యకర్తలకు ప్రమాదబీమా మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతున్నారని, మనస్పర్థలతో అలగడం సరికాదని పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేశ్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలు అలకలకు వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. మొన్నటి ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చామని.. మరింత ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఇన్‌ఛార్జి మంత్రులను కలవాలని తెలిపారు. కార్యకర్తలు సొంతకాళ్లపై నిలబడాలని చంద్రబాబు అంటారని.. వారికి ఉపాధి కల్పించాలని నిత్యం చెబుతుంటారని గుర్తు చేశారు. అందరు నేతలు, కార్యకర్తలు కూటమి ధర్మం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో తెలుగువాళ్లు నెంబర్‌వన్‌గా ఉండాలనేదే మన లక్ష్యం అని నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.