కొవిడ్ టీకాల అభివృద్ధికి కృషి చేసిన కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్ ప్రైజ్

-

వైద్య శాస్త్రంలో చేసిన కృషికి  కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం-2023 లభించింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు వీరిని ఈ అవార్డు వరించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ కమిటీ ఇవాళ నోబెల్ బహమతులను పొందిన వారి జాబితాను వెల్లడించింది.
కాటలిన్​ కరికో.. హంగేరీలోని సాగన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. కరికో, వెయిస్‌మన్‌ కలిసి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో  ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలు చేశారు. కొవిడ్‌-19ను ఎదుర్కొని కోట్లాది మంది ప్రాణాలను కాపాడటానికి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు ఎంతగానో ఉపకరించాయి.
‘కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధికి శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ దోహదపడ్డారు.’ అని నోబెల్ బృందం పేర్కొంది. వైద్య శాస్త్రంలో నోబెల్ విజేతలను థామస్ పెర్లమాన్​ ప్రకటించారు. విజేతలను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే వారిని కలిసి.. నోబెల్ బహుమతి వరించిందని చెప్పగా వారు ఆనందంతో పొంగిపోయారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news