ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా ఫైర్ అయింది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఈ వ్యవహారంపై స్పందించారు. భౌగోళికంగా తమది చిన్న దేశమే అయినా తమను బెదిరించడం మాత్రం తగదని హెచ్చరించారు. దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదని అన్నారు.
చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్న తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముయిజ్జు విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మహా సముద్రంలో తమవి చిన్న ద్వీపాలేనన్న ముయిజ్జు.. కానీ తమకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) ఉందని తెలిపారు. ఇంతపెద్ద వాటా ఉన్న దేశాల్లో తమది ఒకటని చెప్పారు. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదని.. ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటిదని పేర్కొన్నారు. తాము ఎవరి పెరడులోనో లేమని.. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం తమదని చెప్పుకొచ్చారు.