ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందిస్తామని ప్రకటించారు మంత్రి విడదల రజిని. పలు సమస్యల పరిష్కారం కోరుతూ 104 , 108 వాహనాల ఉద్యోగులు తాజాగా సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22 నుంచి సమ్మె నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకోవడంతో.. ఆయా ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి విడదల రజిని గారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి అందించేవికావని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి నెలా జీతాలు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోని ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. 108 ఉద్యోగులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో ఉద్యోగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్య లున్న మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేశారని కొనియాడారు. ఈ రోజు ఈ రెండు వాహనాలు మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో మెరుగైన సేవలను ప్రజలకు అందిస్తున్నాయని తెలిపారు.