భారత్తో బంధం బలహీనమవడంతో మాల్దీవులు సంకట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారత్ను అభ్యర్థించారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైనదని గుర్తు చేస్తూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కొత్తగా ఎన్నికైన మాల్దీవుల ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలని అనుకుటుందని ఫైసల్ అన్నారు. తాము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తామని.. తమ ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా భారతీయులకు ఘన స్వాగతం పలుకుతుందని తెలిపారు. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యటక మంత్రిగా భారతీయులను కోరుతున్నానని పేర్కొన్నారు.
పర్యటకశాఖ గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. క్రితం ఏడాది జనవరి – ఏప్రిల్ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది. ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదికలో పేర్కొంది.