వివాహం చేసుకుంటే ఉద్యోగులకు సహజంగానే సెలవు ఇస్తారు. కంపెనీని బట్టి ఇది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు నివసించే దేశం, అక్కడ ఉండే చట్టాలకు అనుగుణంగా కంపెనీలు సెలవలను ఇస్తుంటాయి. అయితే ఎక్కువ పెయిడ్ లీవ్‌లను పొందడం కోసం అతను ఏకంగా ఒకే మహిళను పలుమార్లు పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇస్తూ మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. లీవ్ కోసం అతను ఆ పని చేశాడు. కానీ అతను పనిచేసిన బ్యాంకుకు విషయం తెలియడంతో అతనికి లీవ్‌ను నిరాకరించింది.
తైవాన్‌లోని తాయ్‌పెయ్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి 37 రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. 3 సార్లు ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఏప్రిల్ 6వ తేదీన తొలుత అతను వివాహం చేసుకున్నాడు. పెళ్లికి గాను సెలవు పెట్టుకుంటే అతనికి 8 రోజుల సెలవు లభించింది. అయితే దాంతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు సెలవు కోసం దరఖాస్తు చేశాడు. అలా అతను తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చి 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందుకు గాను అతను మొత్తం 32 రోజులకు లీవ్ కోసం అప్లై చేశాడు.
అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ వారు విషయాన్ని పసిగట్టి అతనికి 8 రోజుల కన్నా ఎక్కువ లీవ్‌ను ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో అతను కోర్టుకెక్కాడు. చట్ట ప్రకారం తనకు 32 రోజులు లీవ్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నాడు. మరి కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో చూడాలి.