భారత్‌లో ఈ నెల 16వ తేదీ నుంచి అతి పెద్ద కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందులో భాగంగా ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలకు కోవిషీల్డ్ డోస్‌లను సరఫరా చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌తోపాటు కోవాగ్జిన్‌కు కూడా భారత్‌లో అనుమతి లభించింది. దీంతో త్వరలోనే కోవాగ్జిన్‌ను కూడా ప్రజలకు ఇవ్వనున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్లే కాదు, ప్రపంచంలోనే అనేక కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను ప్రస్తుతం ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే 90 శాతం వరకు ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది. అయితే కోవాగ్జిన్‌కు చెందిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కానీ ఆ వ్యాక్సిన్ 70 శాతం మేర ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఇక మరో డ్రగ్ ఉత్పత్తిదారు మోడెర్నా కూడా తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.
తమ వ్యాక్సిన్ ఏడాది వరకు పనిచేస్తుందని మోడెర్నా తెలిపింది. తాము సరికొత్త ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో వ్యాక్సిన్‌ను రూపొందించామని, కనుక వ్యాక్సిన్ ను తీసుకున్నాక శరీర రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతమవుతుందని, ఈ క్రమంలో కరోనా వైరస్ శరీరంలోకి చేరగానే వెంటనే దాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థ నిర్మూలిస్తుందని తెలిపింది. ఇక వ్యాక్సిన్‌ను తీసుకున్నాక కరోనా నుంచి ఏడాది వరకు రక్షణ లభిస్తుందని తెలిపింది. కాగా ఆరంభంలో తాము 60 కోట్ల డోసులను సరఫరా చేస్తామని, ఈ ఏడాది చివరి వరకు 1 బిలియన్ డోసులను సిద్ధం చేస్తామని తెలిపింది.