అంగారకుడి(మార్స్)పై ఎట్టకేలకు నాసా ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగింది. మార్స్‌పై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగం విజయవంతంగా ముగిసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రకటించింది. పర్సెవరెన్స్ రోవర్‌లోని మాక్సీ(మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్) పరికరం తుది అంకంగా 16వ సారి ప్రాణవాయువును ఉత్పత్తి చేసిందని వెల్లడించింది.
అరుణ గ్రహంపై ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే పరీక్ష విజయవంతమైందని.. అంగారకుడిపైకి మానవ సహిత యాత్రలకు ఇది మార్గం సుగమం చేస్తుందని నాసా ట్విటర్లో పేర్కొంది. 2021లో అంగారకుడిపై దిగినప్పటి నుంచి ఆక్సిజన్‌ను మాక్సీ ఉత్పత్తి చేస్తోందని.. ఈ పరికరం ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ ద్వారా అక్కడి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అణువుల్లోని ఒక్కో ఆక్సిజన్ పరమాణువును వేరు చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఆ వాయువులను విశ్లేషించి ఉత్పత్తి అయిన ఆక్సిజన్ పరిమాణం, స్వచ్ఛతను పరీక్షించారని.. ఈ పరికరం ఇప్పటివరకూ మొత్తం 122 గ్రాముల ప్రాణవాయువును తయారు చేసిందని తెలిపింది. ఇది ఈ ప్రయోగ నిర్దేశిత లక్ష్యానికి రెట్టింపు కావడం విశేషమని నాసా ప్రకటించింది.