తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సాయం కోసం అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటూ తమకు బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తలుపు తట్టింది. ఇలా ఐఎంఎఫ్ నుంచి సాయం కోరడం ఇది 24వ సారి. ఈ విషయంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పందించారు. ఆ సంస్థ సాయం లేకుండా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఐఎంఎఫ్ నుంచి మరో ఆర్థిక ప్యాకేజీ లేకుంటే ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదని ప్రధాని షెహబాజ్ అన్నారు. ఎంతో కాలంగా పాతుకు పోయిన నిర్మాణాత్మక సంస్కరణల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే అనేకసార్లు ప్యాకేజీ పొందిన పాక్, మరోసారి చేతులు చాచింది. ఐఎంఎఫ్ నుంచి 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు గతేడాది జూన్‌లో పాకిస్థాన్‌తో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా వచ్చే ఏప్రిల్ నాటికి 1.1 బిలియన్ డాలర్ల ప్యాకేజీ పాక్‌కు లభించనుంది.