ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఎంతో మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇజ్రాయెల్ – పాలస్తీనా దేశాలు సమన్వయంతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని.. ఈ మారణహోమాన్ని ఆపాలని కోరుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతోంటే.. మరికొన్ని పాలస్తీనాకు అండగా నిలుస్తున్నాయి.
తాజాగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో తమ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్‌హైజా స్పందించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తి పాత్ర పోషించాలని ఈ యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేయాలని భారత్‌ను కోరారు. ఈ వ్యవహారంలో భారత్ ప్రధాన పాత్ర పోషించాలని.. అలా అయితే యుద్ధం ఆగే అవకాశం ఉన్నట్లు ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా యుద్ధం వల్ల గాజా, పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఆయన వివరించారు. స్థానికంగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
’40 రోజులుగా పాలస్తీనా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గాయాలతో వారి ఆర్తనాదాలు మమ్మల్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. గాజాలో ఎటు చూసినా శవాల గుట్టలే. ఇది ఇలాగే కొనసాగితే అంటువ్యాధులు ప్రబలి మరింత అనర్థం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఇరు దేశాల మధ్య యుద్ధవిరమణ ఇప్పుడు చాలా అవసరం. దీనికి భారత్ సహకరించాలి. ఇజ్రాయెల్-హమాస్‌తో మాట్లాడి వారిపై ఒత్తిడి తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని సంప్రదించాను.’ అని అద్నాన్ అబుఅల్ హైజా తెలిపారు.