ఎట్టకేలకు పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీ సరైన మెజార్టీ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృతంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలు హంగ్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.
ఈ మేరకు జరిగిన చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు సమాచారం. తమ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ పట్టుబడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిని మూడేళ్లు PML-N, రెండేళ్లు పీపీపీ పంచుకోవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ప్రధాని పగ్గాలను ఏ పార్టీ ముందు స్వీకరించాలన్న విషయంపై స్పష్టత కోసం చర్చలు జరుపుతున్నట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పీఎంఎల్-ఎన్ తరఫున నవాజ్ షరీఫే ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు పీపీపీ తరఫున బిలావల్ భుట్టో ప్రధాని పీఠం ఎక్కనున్నట్లు సమాచారం.