తెలంగాణ సచివాలయ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెక్రటేరియట్ భద్రతను తిరిగి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)కు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ) విభాగం పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కొత్త సచివాలయ భవనం ప్రారంభమైన తర్వాత నుంచి ఈ బాధ్యతల్ని చేపట్టిన టీఎస్‌ఎస్‌పీ .. సచివాలయ ఉద్యోగులతోపాటు సందర్శకులను లోపలికి అనుమతించే యాక్సెస్ కంట్రోల్ వంటి కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. అలాగే కొత్త సచివాలయం నలువైపులా ఏర్పాటు చేసిన సెంట్రీపోస్టుల్లో పహారా చేపడుతున్నారు.
కొత్త సచివాలయం ఏర్పాటైన తర్వాత సచివాలయ భద్రత వ్యవహారాల నుంచి గత సర్కారు అనూహ్యంగా ఎస్‌పీఎఫ్‌ను తప్పించగా.. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే అంశంపై అప్పట్లోనే స్పష్టత కొరవడింది. తాజాగా మళ్లీ ఎస్‌పీఎఫ్‌కే ఆ బాధ్యతల్ని అప్పగించే యోచనలో కొత్త ప్రభుత్వమున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.