రష్యా-ఉత్తర కొరియా అధినేతల భేటీ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపంచానికి సవాల్ విసురుతూ.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఈ ఇరు దేశాల అధినేతలు ఐదు గంటలపాటు చర్చించడం సంచలనంగా మారింది. బుధవారం రోజున ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. రష్యాలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో రష్యా తూర్పు ప్రాంతంలోని లాంచ్ ప్యాడ్ అయిన వోస్తోని కాస్మోడ్రోమ్‌వద్ద భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. యుద్ధంలో తన సంపూర్ణ మద్దతును పుతిన్‌కు కిమ్ ప్రకటించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రష్యాకు పూర్తి, బేషరతు మద్దతు ఇస్తున్నానని కిమ్ అన్నారు.
కిమ్ ఇంకా రెండు నగరాల్లో పర్యటిస్తారని రష్యా అధికార టీవీ ఛానల్‌కు పుతిన్ తెలిపారు. ఉత్తర కొరియా తన దగ్గర ఉన్న వేల ఆయుధ సామగ్రిని అందిస్తే ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా మరింత గట్టిగా పోరాడే అవకాశముందని సమాచారం. ప్రతిగా రష్యా నుంచి సైనిక గూఢచర్య శాటిలైట్లలో సహకారాన్ని కోరుతోంది. ఆర్థిక సహకారంపైనా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత కిమ్‌కు పుతిన్ అధికారిక విందు ఇచ్చారు.