ప్రపంచంలో ఇద్దరు బలమైన దేశాధ్యక్షులు త్వరలో భేటీ కానున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ త్వరలో రష్యాలో పర్యటించనున్నారని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నందున రష్యా.. నార్త్ కొరియా ఆయుధాలను సమీకరించాలనుకుంటుదని ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల అధ్యక్షుల భేటీ ఉండనుందని సమాచారం.
గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ సోమవారం తెలిపారు. క్లెమ్లిన్కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని చెప్పారు. ఈ చర్చలను కొనసాగించాలని, రష్యాలో అధినేతల స్థాయి దౌత్య చర్చలు జరగాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. ఆయుధ కొనుగోళ్లపై రష్యాతో చర్చలు నిలిపివేయాలని, ఆయుధాలని విక్రయించకూడదని ఉత్తర కొరియాకు అమెరికా కోరుతోందని వాట్సన్ తెలిపారు.